*బజారున పడుతున్న నాలుగో స్తంభం ప్రతిష్ట*
*జర్నలిస్టు కావాలి అనుకునే వారికి కనీస విద్యార్హత లేకపోవడం బాధాకరం*
*నిరక్షరాస్యులైనా, వ్రేలి ముద్ర పరిజ్ఞానమైనా టార్గెట్లు పూర్తి చేస్తే చాలు*
*రిపోర్టర్ ఉద్యోగం క్షణాల్లో వచ్చేస్తుంది*
*ఇది పలు యాజమాన్యాల తీరు*
*ఫలితంగా ప్రజల్లో జర్నలిజం అంటేనే నవ్వుల పాలవుతున్న వైనం*
*ఈ పరిస్థితుల్లో కనీస విద్యార్హత నిర్దేశించి అటువంటి వారికే అక్రిడేషన్లు మంజూరు చేసేలా జీవో జారీ చేయాలి*
సమాజాభివృద్ధికి బాటలు వేసే మీడియా విలువలు రాను రాను మరింత దిగజారిపోతున్నాయి. గౌరవప్రదమైన వృత్తిగా, సమాజాన్ని ప్రభావితం చేసే జర్నలిజం దారెటు అనేది అర్థం కావడం లేదు. జర్నలిస్ట్ కావాలి అనుకునే వారికి కనీస విద్యార్హత నిర్దేశించకపోవడం, టార్గెట్లు పూర్తి చేస్తే సక్సెస్ ఫుల్ జర్నలిస్ట్ గా యాజమాన్యాలు రెడ్ కార్పెట్ వేయటం సమాజానికి మూల స్తంభంగా పిలువబడే మీడియా పరువు ప్రజల్లో నవ్వుల పాలవుతోంది.
సమాజాభివృద్ధిలో ప్రధానంగా నాలుగు స్తంభాలను నిర్ణయించారు. మొదటిది శాసనమండలి, రెండవది కార్యనిర్వహక, మూడవది న్యాయవ్యవస్థ, నాలుగవది మీడియా గా పేర్కొనడం జరిగింది. సమాజానికి మూల స్తంభం (ఫోర్త్ ఎస్టేట్) అని కూడా మీడియాను అభివర్ణిస్తారు. మొదటి మూడు వ్యవస్థలు సక్రమంగా పనిచేయకపోయినప్పటికీ వాటిని సక్రమమైన మార్గంలో నడిపించే వ్యవస్థగా మీడియాను మూలస్తంభంగా అభివర్ణించారు. అంతటి ప్రాధాన్యత ఉన్న మీడియా వ్యవస్థ జర్నలిజం నేడు ప్రక్క దారి పడుతోంది. పట్టింది. మూల స్తంభం పటిష్టంగా ఉండి మిగిలిన వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన బాధ్యత కలిగిన నాలుగో స్తంభం కునారిల్లుతోంది. దీనికి అనేక కారణాలు లేకపోలేదు. ప్రధానంగా జర్నలిస్టు కావాలి అనుకునే వారికి ఒక విద్యార్హత లేకపోవడం ఒక కారణమైతే, రాజకీయం అనే చట్రం క్రింద మీడియా స్వేచ్ఛ బందీ కావటం మరో కారణం. పోలీస్ రికార్డుల్లో కేసులు నమోదయి ఉన్నవారిని సైతం జర్నలిస్టుగా పలు యాజమాన్యాలు ఉద్యోగాలు ఇవ్వటం ఫలితంగా మీడియా పరువు బజారున పడటం ఇది ఒక కారణంగా చెప్పవచ్చు.
*నేను జర్నలిస్ట్ కావాలి విద్యార్హత ఏమిటి?*
ఇక ఎవరైనా వచ్చి నేను జర్నలిస్టు కావాలి. విద్యార్హత ఏమిటి అని అడిగితే సమాధానం దొరకదు. ఎందుకంటే జర్నలిస్టు కావాలి అనుకునే వారికి ప్రభుత్వం కానీ, మీడియా యాజమాన్యాలు కానీ కనీస విద్యార్హతను ఇంతవరకు నిర్దేశించలేదు. దీని వలన ఓనమాలు రాని వారికి, టెన్త్ ఫెయిల్ అయిన వారికి సైతం పలు మీడియా యాజమాన్యాలు అందిన కాడికి పుచ్చుకొని ఐడి కార్డులు ఇచ్చేసి సమాజం మీదకు పంపుతున్నాయి. ఇదే అదునుగా చేసుకుని వార్త అంటే తెలియని వారు, అక్షరం ముక్క రాయటం రానివారు సామాజిక స్పృహ మచ్చుకైనా లేని వారు సైతం బెదిరించటం, ఎజెండాగా చేసుకుని జర్నలిస్టుగా రాణిస్తున్నారు. జర్నలిజం పరువును బజారున పడేస్తున్నారు. ఇప్పటికే పడేశారు. గౌరవమైన వృత్తిగా సమాజానికి మూలస్తంభంగా పిలువబడే మీడియా వీరి అరాచకాలు దాటికి కృంగిపోతోంది. బయటకు వెళ్తే చాలు జేబులో ఉన్న ఐడీ కార్డు చూపించి, సామాన్యులు మొదలుకొని వ్యాపారుల వరకు బెదిరించటం, స్వీయ లబ్ది పొందటం పరమావధిగా మారుతుంది. ఇదంతా యాజమాన్యాలకు తెలియదా అంటే పొరపాటే. వారు అడిగినటువంటి సంవత్సరం చందాలు, ప్రకటనలు చేస్తే మీ ఇష్టం అన్న చందంగా స్వేచ్ఛ ను ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. పత్రికా స్వేచ్ఛ స్థానంలో బెదిరించే స్వేచ్ఛ చేరిందని చెప్పటంలో ఏ సందేహం లేదు. అడిగినన్ని డబ్బులు చెల్లిస్తే సన్మానాలు చేసి మరి కేసులు ఉన్నవారి కి సైతం రిపోర్టర్ గా ఐడి కార్డు , అక్రిడిటేషన్ సైతం ఇచ్చేస్తూ, స్వలాభాన్ని పొందుతున్నారు. దీనిని క్యాష్ చేసుకుంటూ బడ్డీ కొట్లు, మాంసం, చేపల మార్కెట్లు, ఇతర స్టాల్స్, రేషన్ మిల్లులు, నూనె దుకాణాలు వద్ద ఆయా కార్డులు చూపుతూ, బెదిరింపులకు తెరలేపుతున్న దుస్థితి నెలకొంది. అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చి వార్తలు ప్రచురించి వాటి పరిష్కారానికి మార్గం చూపితే ఎవరూ కాదనరు. కానీ ఐడీ కార్డు చూపి బ్లాక్ మెయిలింగ్ కు దిగటం వృత్తిని నవ్వుల పాలు చేయడంతో పాటు మిగిలిన జర్నలిస్టులకు కూడా ఆ మరకలను అంటించిన వారవుతున్నారు. దీనిని చూసి జర్నలిస్టులు అందరూ ఇంతే ఉంటారు అనుకుంటా అంటూ సామాన్యులు ముక్కున వేలేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. దీని ప్రభావం మిగిలిన జర్నలిస్టులపై కూడా పడటం నిజంగా బాధాకరం.
"*కనీస విద్యార్హత ఉంటేనే అక్రిడేషన్ ఈ నిబంధన తెస్తేనే కొంతైనా మార్పు.!*
స్లీపర్ ఉద్యోగానికి సైతం ఏడవ తరగతి లేదా పదో తరగతి విద్యార్హతను నిర్దేశిస్తున్నారు. కానీ పవిత్రమైన వృత్తిగా భావించే సమాజాన్ని ప్రభావితం చేస్తూ, అనేక సమస్యల పరిష్కారానికి నాంది పలికే జర్నలిస్టు ఉద్యోగానికి విద్యార్హత నిర్దేశించలేదు. ఇకనైనా ప్రభుత్వాలు దృష్టి సారించాలి. నారా లోకేష్ విద్యా శాఖ మంత్రిగా ఉంటూ, ఈ శాఖలో అనేక విప్లవాత్మక మార్పులు సమూలంగా తీసుకువస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇదే కోణంలో మండల స్థాయి విలేఖరికి కనీస విద్యార్హత ఇంటర్మీడియట్, జిల్లా స్థాయి విలేఖరికి డిగ్రీ నిర్దేశిస్తూ జీవో తీసుకురావాలి. అలా విద్యార్హత ఉంటేనే అక్రిడేషన్ ఇచ్చేలా నిబంధన రూపొందించాలి. ఈ నిబంధన పాటించకుండా కనీస విద్యార్హతలు లేని వారికి ఐడి కార్డ్ జారీ చేసే మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. దీనివలన సమాజంలో జర్నలిజానికి విలువ పెరగటంతో పాటు స్క్రాప్ బ్యాచ్ కొంతైనా తగ్గే అవకాశం ఉంటుంది.
Post A Comment:
0 comments: