మే 2026

ప్రభుత్వ పురస్కారాల ప్రకటన అభినందనీయం

జర్నలిస్టులను ప్రోత్సహించే చర్యలు కొనసాగాలి

మీడియా అకాడమీ చైర్మన్‌ను అభినందించిన తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉత్తమ జర్నలిస్టులకు పురస్కారాలు ప్రకటించడం అభినందనీయమని తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు పేర్కొన్నారు. బుధవారం మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్‌ను సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మాలెంపాటి శ్రీనివాసరావుతో కలిసి రంగనాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతిభ కలిగిన జర్నలిస్టులను గుర్తించి ప్రోత్సహించడం సమాజానికి, మీడియా రంగానికి ఎంతో అవసరమన్నారు. గత కొన్నేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున జర్నలిస్టులకు ప్రత్యేక పురస్కారాలు అందించకపోవడం బాధాకరమని, ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం ఈ దిశగా ముందడుగు వేయడం సంతోషకరమన్నారు. ప్రతి ఏడాది ఇటువంటి పురస్కారాలను నిరంతరంగా అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం కూడా గత మూడు సంవత్సరాలుగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రతిభ కనబరిచిన జర్నలిస్టులను గుర్తించి, వారికి పురస్కారాలతో పాటు నగదు బహుమతులు అందజేస్తోందని తెలిపారు. ముఖ్యంగా తక్కువ వేతనాలతో లేదా వేతనాలు లేకుండా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇటువంటి గుర్తింపులు ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు.
గతంలో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేతుల మీదుగా ఉత్తమ తెలుగు జర్నలిస్టులకు పురస్కారాలు అందజేశామని గుర్తు చేశారు. ఇదే క్రమంలో 2026 సంవత్సరానికి సంబంధించిన “ఉత్తమ తెలుగు జర్నలిస్టు పురస్కారాల” ప్రదానోత్సవాన్ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజును ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు.
జర్నలిస్టుల సంక్షేమంతో పాటు సామాజిక బాధ్యతతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంఘం ప్రధాన లక్ష్యమని రంగనాయకులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా జర్నలిస్టులను ప్రోత్సహించే విధంగా పురస్కారాలు, ప్రోత్సాహక కార్యక్రమాలను మరింత విస్తరించాలని కోరారు. ఆ దిశగా మీడియా అకాడమీ ఆధ్వర్యంలో పురస్కారాల ప్రకటన జరగడం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి పార్థసారథి, మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్, ఐఅండ్‌పీఆర్ కమిషనర్ కె.ఎస్. విశ్వనాధన్ తదితరులకు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జర్నలిస్టుల ప్రోత్సాహానికి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.